Sunday, July 1, 2018

దేవునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా!

మనము క్రీస్తు నందు నివసిస్తున్నామన్న విషయము తెలిసినదే. ఆయనలో మనము నిత్యజీవమును పొందాము. అనుదినము ఆయన మనకు చేస్తున్న ఉపకారముల వలన మనము ఆనందమైన జీవితమును జీవించుచున్నాము. రెండవ మరణము మనలను ఏమీ చేయదను నమ్మకముతో జీవిస్తున్నాము. వీటన్నిటికి కారణము యేసు క్రీస్తు.

ఆయనలో ఇంతగా ఆనందిస్తున్న మనము ఈ నిజమైన దేవుని గురించి ఇతరులతో చెప్పి మన అనందమును వారితో పంచుకొనవలెను కదా! కానీ చెపితే ఏమనుకొంటారో అన్న భయముతో స్వార్ధపరులుగా ప్రవర్తిస్తున్నాము! దేవునిలో జీవించుటలో ఉన్న ఆనందాన్ని మనమే అనుభవిస్తున్నాము. అన్యులు మనమీద అంత్య తీర్పు సమయములో నేరారోపణ చేస్తారు అన్న విషయమును గుర్తించలేక పోతున్నాము. వారు మనమీద ఏమి నేరము మోపుతారంటే:

"ఓ యేసు క్రీస్తు ప్రభూ! వీరు మిమ్ములను తెలుసుకొని మీలో చాలా ఆనందించారు గాని మాకు మీ గురించి ఏనాడూ చెప్పలేదు! అందువలన వారికి చెందవలసిన పరలోక రాజ్యమును మాకు దయచేయమని అడుగుతారు" అప్పుడు షీబా దేశపు రాణి కూడా మనమీద నింద మోపుతుంది! (మత్తయి 12:42)

షీబా దేశపు రాణి మనమీద ఎందుకు నేరారోపణ చేస్తుంది?

ఎందుకంటే, ఆమె సోలోమోను జ్ఞానము గురించి విని ఆయనను చూడడానికి వెళ్ళినది. ఆమెకు సోలోమాను గురించి ఎలా తెలిసినది? ఎవరో చెప్పబట్టే కదా! ఈ సోలోమోను కంటే గొప్పవాడైన యేసు క్రీస్తు ప్రభువు గురించి మనకు తెలిసీ మనతో వున్న వారికి చెప్పకపోతే ఆమె ఊరుకొంటుందా? ఆమె అన్యుల తరపున మనమీద నేరారోపణ చేయదా? (మత్తయి 12:42)

కాబట్టి, మనము మనకు తెలిసన వారందరికీ సువార్తను తెలియ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు పూర్తి బైబులు ఇచ్చి, నా పనైపోయిందిలే అనుకొంటే సరిపోదు. మనము వారికి అర్ధమయ్యేట్లు చెప్పవలెను. అందుకు ఈ చిన్న కధ పనికి వస్తుందని భావిస్తున్నాను. దయచేసి దీనిని మీరు చదివి ఏమైనా మార్పులు చేయాలంటే నాకు తెలియచేయండి. అలాగే  మీ యొక్క బంధుమిత్రులకి ఈ కధ యొక్క ప్రతిని ఇవ్వండి. ఆ తర్వాత వారి అభిప్రాయమును తెలిసుకోండి.

దేవుని సువార్తను అందరితో పంచుకొనటమే మన ధ్యేయం!

ఫెయిత్ స్కోప్.కామ్ - FaithScope.com

ఒక రాకుమారుడి కధ! 


ఒక రాజుకి ఒక కుమారుడు వుండే వాడు. రాజుకి తన కుమారుడు అంటే ప్రాణం. అలాగే తన ప్రజలన్న ప్రాణం. రాజు మరియు రాజ కుమారుడు ప్రజలను కన్న బిడ్డల వలే చూసుకునేవారు. అయన రాజ్యములో పాపము లేనందు వలన శాంతి సమాధానాలు ఉండేవి. కానీ శత్రు రాజ్యాల కుట్ర వలన పాపము ప్రవేశించింది. ప్రజలు పాపము  చేయడానికి అలవాటు పడ్డారు. దొంగలించుట, వ్యభిచారము, చంపుట వంటి దురలవాట్లకి అలవాటు పడ్డారు. రాజ్యములో శాంతి సమాధానము కరువయ్యాయని రాజుకి అర్ధమైనది. పాపము చేసిన వారందరిని బంధించి వారిని శిక్షించాలని తలచారు. శిక్ష అమలు చేసే సమయానికి పాపులు రాజు కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగేవారు. రాజుకి వారి పరిస్తితి చూసి జాలి మరియు బాధ కలిగేది. ఆయన వారిపై జాలి చూపి వాళ్ళని ఇకపై పాపము చేయవద్దని వదిలేసేవారు.

కానీ పరిస్థితి మారలేదు,  వారు మరల పాపము చేయడం ఆపలేదు.  ప్రజలు పాపము చేసి రాజుని క్షమాపణ అడిగేవారు, అది వారికి అలవాటైపోయింది. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో రాజు వారికి పాప క్షమాపణ ఊరికే ఇవ్వకుండా ప్రాయచిత్తానికి  ఏదో ఒక శిక్షని ఇవ్వడం మొదులుపెట్టారు. అవి ఎటువంటివి అంటే:
  1. తల నీలాలు అర్పించుట
  2. పుణ్య నదిలో స్నానాలు ఆచరించుట.
  3. గోనె సంచులు ధరించి ఉపవాసము ఉండుట.
ఈ శిక్షలతో కూడా పరిస్థితి మారలేదు వారు మరల పాపము చేయడం ఆపలేదు. అందుకు రాజు మరింత కఠినమైన శిక్షని ఇవ్వడము మొదలుపెట్టారు. అది ఏమిటంటే పాపము చేసిన వాడు ప్రాయచిత్తముగ తన జీవనాధారమైన పశువును బలిగా ఇమ్మన్నారు. దీనివల్ల కొంతమంది భయపడి పాపము చేయుట మానారు. ఎందుకంటే వారికి  జీవనాధారమైన, అతి ప్రేమతో పెంచుకొన్న పశువు లేకపోతే జీవించడము కష్టము కదా!

కానీ అందరు పాపము చేయుట మానలేదు. ధనవంతుల దగ్గర చాలా పశువులు వున్నవి కదా, వారికి బలి అర్పించడము సాధారణమైన విషయము అయినది.

ఇటువంటి పరిస్థితుల్లో రాజు తన మంత్రులను ప్రజల దగ్గరికి పంపి వారిచే పాపము చేయవద్దని బోధించేవాడు. కొంతమంది వారి మాటవిని మారారు. కొంత మంది వారిపై దాడి చేసి హింసించి అంతటితో ఆగక వారిని చంపేసారు. రాజుకి చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో అయన పాపం చేసిన వారందరిని చంపేసేవాడే కానీ మారిన కొంతమందిని చూసి మరియు తనకున్న ప్రేమని బట్టి ఆయన వారిని చంపలేదు. భయంకరమైన నేరాలు చేసిన వారికి మాత్రమే మరణ శిక్ష విధించాడు.రాజుకి ప్రజలను శిక్షించుట ఇష్టము లేదు, వారు మారాలనే తన ఆశ.

రాజు ప్రజలమీద తనకు ఉన్న ప్రేమతో చివరికి తన ప్రియమైన కుమారుని వారి దగ్గరకు పంపినారు. రాజ కుమారుడు తన అధికారాన్ని వదిలి ప్రజలలో కలసిపోయి వారిలో ఒకడిగా జీవించాడు. వారిలో ఒకడిగా పాపం చేయకుండా జీవిస్తూ వారికి  మంచి పద్దతులు నేర్పే వాడు. ఆయనను చూసి చాలామంది మంచివారుగా మారారు. కొంతమంది అయన చేయు బోధనలో అయన సహాయకులుగా మారారు. వీరితో కలసి రాజ కుమారుడు తన రాజ్యములో పర్యటిస్తూ మంచి మార్గాన్ని మరియు తన తండ్రికి  ప్రజలపై ఉన్న ప్రేమను బోధించాడు. అయన బోధనలోని ముఖ్యమైన  విషయాలేమిటంటే:
  1. పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుని  ప్రేమింప వలెను.
  2. నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను.
  3. ఒకరికి ఒకరు క్షమించుకోవాలి, పగ పట్ట రాదు. 
వీటిని మీరు మనస్పూర్తిగా ఆచరించిన మీరు ఏ పాపమూ చేయరు. ఎవరైనా దేవుని మనస్పూర్తిగా ప్రేమిస్తూ మరియు తన పోరుగువానిని తనలాగా చూచుకోనేవాడు తన తల్లిని, తండ్రిని మంచిగా చూచుకోరా? దొంగిలిస్తారా? వ్యభిచరిస్తారా? హత్య చేస్తారా?అబద్ద సాక్ష్యములు పలకగలరా?

రాజ కుమారుడు చెప్పిన ఒక ఉపమానాన్ని మనము ఇప్పుడు చదువుకొందము:

"ఒక యజమాని దగ్గర చాలా అప్పు వున్న ఒక దాసుడు అతనియొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వానియొద్ద ఏమియు లేనందున, వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వాని ఆస్తిని అమ్మి, అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపిం చెను. కాబట్టి ఆ దాసుడు అతని యెదుట సాగిలపడి మ్రొక్కి, కొంత కాలము గడువునియ్యుము, మీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసునిపై యజమానుడు కనికర పడి, వానిని విడిచిపెట్టి, వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు కొంచెమే అప్పుబడి వున్న తన తోడిదాసులలో ఒకనినిచూచి, వాని గొంతుపట్టుకొని చెల్లింపు మనెను. అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి నాకు కొంత గడువునియ్యుము, నీకు చెల్లించెదనని వానిని వేడు కొనెను గాని వాడు ఒప్పుకొనక తన అప్పు తీర్చు వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి, మిక్కిలి దుఃఖపడి, వచ్చి, జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి దుర్మార్గుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని; నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెను గదా! అని వానిని చెరసాలలో పడవేయించెను."

మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయునని రాజ కుమారుడు ఈ చిన్న ఉపమానము ద్వారా చెప్పెను.తన బోధతో అయన అందరిని పాపమునుండి విముక్తులు కమ్మని, తండ్రి ప్రేమ చాలా గొప్పదని, మారు మనస్సు పొంది మంచిగా జీవించేవారి పాపములు క్షమించబడునని చెప్పారు. మారు మనస్సు పొందిన వారిని తన తండ్రి శిక్షించడని వారికి మరియొక ఉపమానమును చెప్పాడు:

"ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడుతండ్రీ, ఆస్తిలో నాకువచ్చు భాగమిమ్మని తన తండ్రి నడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్నిదినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని, దూర దేశమునకు ప్రయాణమై పోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడ సాగి, వెళ్లి ఆ దేశస్థులలో ఒకనిచెంత జేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని యెవడును వాని కేమియు ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడునా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవు చున్నాను. నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి--తండ్రీ! నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదు ననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను. వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితోతండ్రీ, నేను పరలోక మునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికికట్టి,  వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి;విందు సిద్ధము చేయుడి, మనము తిని సంతోషపడుదము; ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను;"

మరొక ఉపమానము:

"మీలో ఏ మనుష్యునికైనను నూరు గొర్రెలు కలిగి యుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయినది దొరకువరకు దానిని వెదక వెళ్లడా? అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజములమీద వేసి కొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతోకూడ సంతోషించుడి; తప్పి పోయిన నా గొర్రె దొరకినదని వారితో చెప్పును గదా. అలాగే ఏ స్త్రీకైనను పది విలువైన నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకొంటె ఆమె దీపము వెలిగించి యిల్లు ఊడ్చి అది దొరకువరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరకినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడ సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరకినదని వారితో చెప్పును గదా"

అలాగే  నిజముగా మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై నా తండ్రికి సంతోషము కలుగునని చెప్పెను. రాజకుమారుడు ఇటువంటి బోధ్నలెన్నో ప్రజలకు నేర్పించి మారు మనస్సు పొందమని చెప్పెను.

కాని, అయన మంచి బోధనను తట్టుకోలేని కొందరు ఆయనను క్రూరాతి క్రూరమైన మరణమునకు గురి చేసారు, ఆ మరణశయ్య మీదున్న తన కుమారుని చూసి రాజు హృదయము విలవిలలాడింది. రాజు బాధతో కోపముతో పాపత్ములంధరిని సంహరించాలనుకొన్నాడు. అయన కోపము భూమినిసైతం గడగడ లాడించింది.
 
కానీ, మరణశయ్య మీదున్న రాజ కుమారుడు రాజుతో ఈ విధముగా వేడుకున్నాడు "తండ్రీ వీరు ఏమిచేయుచున్నారో వీరు ఎరుగరు, నన్ను చూసి వారిని క్షమించండి". ఈ మాటలు విన్న వారి హృదయాలు ధ్రవించాయి. రాజు కుమారిని మరణానికి కారణమయిన ఒకడు ఈ విధముగా విలపించాడు "అయ్యో! నేను మీకు ఇంత ద్రోహము చేసినప్పటికీ నన్ను క్షమిస్తున్నావా! నాకు పడవలసిన శిక్షను నీవు తీసుకోన్నావే! ఇంత ప్రేమ నన్ను క్రుంగ తీస్తున్నది. ఇక ఏనాటికి నేను పాపము చేయను!". ఇలా ఎంతో మంది రాజ కుమారుని  ప్రాణ త్యాగము వలన పాప విముక్తులు అయినారు.

ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే ఇది కధ కాదు! ఇది నిజముగానే జరిగినది! ఆ రాజు ఎవరో కాదు మన సృష్టికర్తయైన దేవాధిదేవుడు. ఆయనుకు మనమందరము ప్రియమైన బిడ్డలము. ఏ తండ్రైన తన బిడ్డలు చెడు దారి  పడుతుంటే ఎలా బాధ పడుతారో అలాగే దేవాది దేవుడు తన దారి తప్పిన ప్రజలకోసం బాధపడుతున్నాడు. ఎందుకంటే మనిషిని సృష్టించి తన జీవాత్మను మనలో ఉంచాడు. ఆయన తన ప్రేమను ఏవిధముగా వ్యక్తము చేసాడంటే:

"అయ్యో! మిమ్మల్ని నేను కోడి తన రెక్కల క్రింద తన పిల్లలని కాపాడినట్లు మిమ్ములను నేను కాపాడానే! అయినా మీరు నన్ను మరిచితిరే!

మీలో ఏ తండ్రైన మీ పిల్లలు ఆకలేస్తుంది అన్నం పెట్టమంటే రాయిని తినమని చెపుతారా? పాపములో నున్న మీరే అంతగా మీ పిల్లలను ప్రేమిస్తుంటే నేను మిమ్మలని ఎంతగా ప్రేమిస్తున్నానో అర్ధముచేసుకోగలరా?"

తండ్రికి తన పిల్లలకి వున్న సంబంధం వంటిదే దేవునికి మనకు మధ్య వున్న సంబంధము.

మరి రాజు మన సృష్టికర్తయైన దేవుడు అని తెలుసుకొన్నాము కదా! మరి రాజకుమారుడు ఎవరు? అయన గురించి ఇప్పుడు తెలుసుకొందాం.

దేవుని యొక్క పలుకులకు రూపమే ధైవకుమారుడు. ఈ దేవుని పలుకు ద్వారానే ఈ సమస్త సృష్టి సృజించబడినది. దేవుని పలుకే ధైవకుమరునిగా మరియు సామాన్య మనిషిగా ఈ లోకంలో జన్మించి మనకోసరము ప్రాణ త్యాగము చేసినది. కాబట్టి రాజ కుమారుడు ఎవరో కాదు ధైవకుమారుడే! అంటే దేవుడే! ఇక్కడనుండి మనము రాజుని దేవుడని మరియు రాజ కుమారుడిని దేవుని కుమారుడని చదువుకొందము. ఇప్పుడు మనము ఈ నిజమైన కధలోకి వెళ్ళెదము ...

దైవకుమారుడు మానవ రూపములో కౄరాతి క్కౄరముగా  హింసించబడి  మరణశయ్య మీదున్నాడు. ఈ ధైవకుమారుని   మానవునిగా నవ మాసాలు కని పెంచిన తల్లి తన కుమారుని చూసి విలపిస్తున్నది.  ఏ తల్లికైనా తన బిడ్డని తన కళ్ళ ఎదురుగా అలా  హింసించి చంపుతుంటే ఎలా ఉంటుందో వుహించనలవి కానిది. ఆ తల్లి హృదయం తల్లడిల్లినది, ఓ పెద్ద గునపము తన గుండెల్లో దిగినంత బాధ. దైవకుమారుడు కొన్ని గంటలపాటు మరణయాతన పడి చివరకు మరణించాడు. చనిపోయిన తన  కుమారుని తన స్వహస్తాలతో అంత్యక్రియలు చేసినది ఆ తల్లి. దీనితో ధైవకుమారుని మానవ అవతారము సమాప్తి అయినది. "ఇంత ఘోరము జరుగుతుంటే ఆ దేవుడు ఎలా ఊరకే వున్నాడు" అను సంశయం కలగడము సహజమేగదా! ఎందుకంటే ఇది తన ప్రణాలిక ప్రకారము జరిగినది. మీకోసం నా ప్రాణాన్ని ఇవ్వగలిగినంత ప్రేమ వున్నదని చెప్పడమే కాదు! చేసి చూపించాడు!

మానవునిగా దేవుని ప్రణాళికను నెరవేర్చిన దైవ కుమారుడు విజయుడుగా పునరుత్తానుడై  పరలోకములో నున్నతన తండ్రి దగ్గరకు తిరిగి వెళ్ళాడు. దేవుడు తన కుమారునికి ఈ మానవాళి మీద సర్వాధికారాలు ఇచ్చారు, తన కుమారుడే ఈ ప్రజలకు తీర్పు చేస్తారని చెప్పారు. ఇది మానవులకు ఆనందకరమైన విషయము ఎందుకంటే దైవకుమారుడు మానవుడుగా జీవించినందు వలన ఆయనకు మానవునిగా జీవించుటలో ఉన్న బాధలన్నీ బాగా తెలుసును. కాబట్టి ఆయన మనకు ఖచ్చితముగా న్యాయము చేయగలరు. మనము చనిపోయిన తర్వాత మనకు ఆయన  తీర్పు చేస్తారు, కాబట్టి మనము ఆయన ఈ భూమి మీద చెప్పిన విషయాలను జాగ్రత్తగా పాటించడము మంచిది. ఆయన మనకు చెప్పిన ఒక ఉపమానము ఈ విధముగా వున్నది:

"తన మహిమతో దైవ కుమారుడును ఆయనతో కూడ సమస్త దేవ దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి, తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు దైవకుమారుడు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవార లారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి; దిగంబరినై యుంటిని, నాకు బట్ట లిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెర సాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును అందుకు నీతిమంతులుప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొ నియుండుట చూచి నీకాహారమిచ్చి తివిు? నీవు దప్పిగొని యుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితివిు? ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితివిు?ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజుమిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి శపింప బడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు; దప్పి గొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు; పరదేశినై యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు; దిగంబరినై యుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు; రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును. అందుకు వారు ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని యుండుటయైనను, దప్పిగొనియుండుటయైనను, పరదేశివై యుండుటయైనను, దిగంబరివై యుండుటయైనను, రోగివై యుండుటను చూడలేదనిరి¸అందుకాయనమిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు."

కాబట్టి మనము సాటి మనిషికి సాయం చేయడము చాలా మంచిది.

ఈ భూమ్యాకాశాలను దేవుని వాక్కైన దైవకుమారుడు సృష్టించాడని తెలుసు కొన్నాము కదా! ఆయన సృష్టించినప్పుడు ఈ లోకములో పాపము లేదు. అయితే పాపము ఈ సృష్టి లోకి ఎలా వచ్చినది? అసలు పాప మంటే ఏమిటి?

దేవుడు మనిషిని ఒక మరమనిషిగా చేయలేదు. తనంతట తాను ఆలోచించి సొంత నిర్ణయము తీసుకొనే శక్తిని ఇచ్చాడుగాని ఒక్క మంచి చెడు అని తెలియజేసే శక్తిని మాత్రము ఇవ్వలేదు. కాబట్టి మొదటి మానవులలో పాపము అనేది లేదు ఎందుకంటే మంచేదో చెడేదో వారికి  తెలియదు, చిన్నపిల్లల మనస్తత్వముతో వుండేవారు. పాపము లేనందువలన వారికి మరణము కూడా లేదు. కాకపోతే మనిషి ఒక చెడిపోయిన దేవదూత ప్రోద్బలము వలన మంచి చెడు తెలియజేసే శక్తిని దేవుడు వద్దన్నప్పటికి అడిగినందువలన దేవుడు మంచి మరియు చెడు గురించి తెలిపే శాసనాలను మన హృదయములో ముద్రించాడు. ఈ శాసనాల వల్ల ప్రతి మనిషి కొంచెము ఆలోచిస్తే చెడేదో మంచేదో తెలుసుకోగలరు. మానవులు చపలమనస్కులని తెలిసినదేకదా! తప్పు చేసేవాడికి తను తప్పు చేస్తున్నానని తెలిసి చేయడమే పాపము. ఈ భూమిమీద ఏదో ఒక పాపము చేయనివారు ఎవరూ లేరన్నది వాస్తవము. దీనివలను మానవునికి మరణము ప్రాప్తించింది.

మనమందరము పాపము చేసినవారమే, ఏదో ఒక రోజు చనిపోతాము, దైవకుమారుని ముందు తీర్పుకు నిలబడ వలసిన వాళ్ళము. కాబట్టి మనము చనిపోకముందే మన పాపములను  తొలగించుకోవాలి. ఎందుకంటే దైవకుమారుడు మన కోసరము క్రొత్త భూమిని సిద్దపరచే పనిలో వున్నారు. పాపములోనున్న వారికి  దీనిలో ప్రవేశము లేదు. ఎలా మన పాపములను తొలగించుకొనగలము? అది దైవకుమారుని వల్లనే సాద్యము. ఎందుకంటే ఆయన మనకు పడవలసిన మరణ శిక్షను తన మీద వేసుకొని మనలను క్షమించమని తన తండ్రిని వేడుకొన్నాడు.  కాబట్టి మనము మారు మనస్సు పొంది, పశ్చాత్తాపపడి ఆ ధైవకుమారుడు ఇచ్చిన క్షమాబిక్షను అంగీకరిస్తే చాలు, ఆయన తన మరణశయ్య మీదనుంచి కారిన తన రక్తముతో మన పాపాలన్నియు కడిగివేస్తారు. మనలను తన తండ్రి అంగీకరించేలా మనలను తీర్చి దిద్దుతారు. ఇది ప్రపంచములో నున్న ప్రతి మానవునికి దైవకుమారుని ఉచితమైన పిలుపు. కులము, మతము, పేద, గొప్ప అనే తేడా లేదు. ఎటువంటి పాపి అయినను మన్నింపును పొందవచ్చు.  దైవకుమారుడు ఈ విధముగా మానవాళిని పిలుస్తున్నాడు "ప్రయాసపడి పాప భారము మోస్తున్న నా ప్రజలారా! నా యొద్దకు రండు నేను మీకు విశ్రాంతిని కలుగచేతును". కాబట్టి ఆయన మాట విని వచ్చిన వారికి పాప క్షమాపణ దొరుకుతుంది, వారి ఆత్మకు పట్టిన పాపమనే మలినము పోయి ఆత్మ తిరిగి తన పూర్వ సౌందర్యాన్ని పొందుతుంది. కాకపోతే ఒకటి మనము కూడా చేయాలి అది "దేవుడు మనలను క్షమించినట్లు మనము కూడా ఒకరికి ఒకరు ఉచితముగానే క్షమించుకోవాలి"

ఉచితముగా వస్తే పేనాయిలు అయినా త్రాగుతామని అంటుంటారు కదా! అటువంటప్పుడు మనము ఈ ఉచితముగా ఇవ్వపడుతున్న పాప పరిష్కారము పొందుటకు ఎంత ఆతురత పడాలో మనము ఆలోచించవలసిన విషయము. ఎందుకంటే మరణము ఏరోజు వస్తుందో ఎవరికీ తెలియదు. పాప క్షమాపణ మరణించుటకు ముందే పొందాలి, ఎందుకంటే దేవకుమారుని పాప క్షమాపణ అనే యజ్ఞము మానవునిగా ఈ భూమి మీదే మరణశయ్య మీద పూర్తి చేసాడు. కాబట్టి మనము కూడా పాప క్షమాపణను ఈ భూమి మీదే పొందాలి.

అందరి పాపాలు ఊరికే క్షమిస్తే మంచి వారికి  చెడు చేసిన వారికి తేడా ఏమిటి? అందరు నూతన సృష్టిలో ఒకటేనా? మంచిగా జీవించుటలో ఏమీ ప్రయోజనము లేదా? అనే ప్రశ్న మనల్ని బాధించక మానదు. అందుకనే మనము మరికొన్ని విషయములు తెలుసుకొందాం:

ఈ లోకములో పాపము చేయనివారు ఎవరన్నా వున్నారా? ఏదో ఒక పాపము చేయనివారు వుండరు, చిన్నదో, పెద్దదో  అబద్దము చెప్పనివారు వుండరు. అంటే ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ అవసరము. దేవకుమారుని అడిగిన వారందరికీ పాప క్షమాపణ దయచేస్తారు. అలాగే ప్రతి ఒక్కరు ఏదో ఒక మంచి పని చేసే వుంటారు. ఇవి వారితో వారి కిరీటాలుగా చనిపోయిన తర్వాత కూడా వారి ఆత్మ వాటిని తీసుకువెలుతుంది. దేవుడు వారు చేసిన ఈ మంచి పనులను బట్టి నూతన సృష్టిలో వారికి రావలసిన బహుమతులు ఇస్తారు.

ఇదంతా బాగానే వుంది ఇంతకి క్షమాపణ అడగాలంటే ఈ దైవకుమారుడు ఎక్కడవుంటాడు? ఏ గుడికి వెళ్ళాలి? ఏ కొండను ఎక్కాలి? ఎవరిని అడగాలి? ఎలా ఆయనను కనుగొనాలి?

దేవుడు మనలని సృష్టించినప్పుడు ఆయన మన హృదయంలో నివాసమేర్పరచుకున్నాడు. మన దేహమే దేవునికి ఆలయము. పాపము వలన మనకు దేవునికి మధ్య దూరము పెరిగినది. దైవకుమారుడు మన హృదయపు తలుపులు ఎపుడు తెరచదరా! అని వేచియున్నాడు. అయన నిజము. నిజాన్ని వెతికే వారికి ఆయన తప్పక దారి చూపుతారు. ఆయనే మనలని కనుగొంటాడు. ఆయన చెప్పిన మాటలు ఈ విధముగా వున్నాయి: "అడుగుడీ! మీకియ్యబడును. వెదకుడీ! మీకు దొరకును, తట్టుడీ! మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయ బడును.".  కాబట్టి మనము ధైర్యముగా సత్యాన్వేషణకు సిద్దపడడమే మనము చేయవలసినది. మీరు నిజము తెలుసుకోడానికి భయపడకుండా ఇటువంటి చిన్న ప్రార్ధన చేసిన చాలు:

"సమస్తమును సృష్టించిన ఓ దేవా దయచేసి నాకు నిజమును తెలియచేయండి. నేను నిజమైన దేవుడిని తెలుసుకొనగోరుచున్నాను. మీ కుమారుని వలన రక్షణ పొందగోరుచున్నాను. మీరు ఆయనను నాకు తెలియపరచండి, నా హృదయమును మీకు అర్పిస్తున్నాను. నాయందు మీరు నివసించండి, నాకు మార్గము చూపండి మరియు నన్ను మీ సన్నిధికి నడిపించండి."

దేవుడు మీకు తప్పక దారి చూపెదరు. ఇదే నిజమైన సువార్త!


Sunday, August 23, 2015

Increase Font Size Decrease Font Size మనము క్రీస్తు నందు నివసిస్తున్నామన్న విషయము తెలిసినదే. ఆయనలో మనము నిత్యజీవమును పొందాము. అనుదినము ఆయన మనకు చేస్తున్న ఉపకారముల వలన మనము ఆనందమైన జీవితమును జీవించుచున్నాము. రెండవ మరణము మనలను ఏమీ చేయదను నమ్మకముతో జీవిస్తున్నాము. వీటన్నిటికి కారణము యేసు క్రీస్తు.